సంగతి, గురుగ్రామ్: తనను వివాహం చేసుకునేందుకు నిరాకరించిందని ఓ యువకుడు ఓ వివాహితను హత్య చేయబోయాడు. క్లబ్లో పనిచేస్తున్న 25 ఏళ్ల వివాహిత మహిళపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లో డిసెంబర్ 20 అర్ధరాత్రి ఎంజీ రోడ్‌లోని ఓ క్లబ్లో చోటు చేసుకున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు. తొలుత కాల్పులకు గాయపడిన ఆమెను ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా వాంగ్మూలం ఇవ్వలేక పోయింది.
ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేస్తూ తన భార్య కల్పన (25) గురుగ్రామ్‌లోని ఓ క్లబ్లో పనిచేస్తోందని, సంగమ్ విహార్ (ఢిల్లీ) నివాసి తుషార్ ఆమెపై కాల్పులు జరిపినట్లు చెప్పాడు. డిసెంబర్ 19న తన భార్య పని కోసం వెళ్లిందని, రాత్రి సుమారు 1 గంట సమయంలో ఫోన్ చేసి తనపై కాల్పులు జరిగాయని తెలిపిందని భర్త వివరించాడు.
“ నెల రోజుల క్రితం తుషార్ మా ఇంటికి వచ్చి మాతో గొడవపడి వెళ్లాడు,” అని ఫిర్యాదుదారు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి తుషార్ అలియాస్ జాంటీ (25) మరియు అతని స్నేహితుడు శుభమ్ అలియాస్ జోనీ (24) — ఇద్దరిని ఉత్తరప్రదేశ్‌లోని బరౌట్ ప్రాంతంలో అరెస్టు చేశారు. బాధితురాలితో తనకు ఆరు నెలలుగా పరిచయం ఉందని, ఎన్నో మార్లు వివాహం చేసుకోవాలని బ్రతిమిలాడుకున్నా ఆమె వినకపోవడంతోనే తాను అలా చేసినట్లు తుషార్ తమకు విచారణలో చెప్పినట్లు పోలీసులు తెలిపారు.
