సంగతి, భక్తి: చదువులకు మాత సరస్వతీ దేవి జన్మించిన రోజు నేడు. ఈ పర్వదినాన్ని వసంతపంచమిగా దేశమంతటా జరుపుకుంటారు. దేవాలయాలన్ని నేడు (జనవరి, 23) భక్తులతో కిటకిటలాడనున్నాయి. ముఖ్యంగా ఈ పర్వదినం ఒక చదువుల పండుగగా జరుపుతారు. ప్రతి ఇంటిలోని చిన్నారులకు ఈ రోజు అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసం చేయించడం ద్వారా తమ పిల్లలకు ఆ తల్లి కృపతో విపరీతమైన జ్ఞానం లభిస్తుందని నమ్మకం. దేశంలో అమ్మవారే స్వయంగా ఈ భువిపై దిగి అవతార మూర్తిగా వెలసిన క్షేత్రాలు ఒకటి మన తెలంగాణ రాష్ట్రంలోని బాసర కాగా మరోటి జమ్ముకశ్మీర్‌లోని వైష్ణోదేవి ఆలయం.
వసంత పంచమి ప్రత్యేకత
మాఘ శుద్ధ పంచమి రోజు వసంత పంచమి జరుపుతుంటారు. ఈ రోజు సరస్వతి దేవికి పూజ చేయాలి. దానాలు చేయడం మంచిది. ఈ దానాల వలన మాధవుడు (వసంతుడు) సంతోషిస్తాడని, అందుకే దీనిని వసంతోత్సవము అని కూడా చెప్తారు. సర్వవిద్యలకూ ఆధారం వాగ్దేవే కనుక చిన్నపెద్ద తేడాల్లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి ఆరాధిస్తారు. సంగీత నృత్యసాహిత్యాలకు కూడా ఈ దేవీ యే మూలమని నృత్యకేళీవిలాసాలతో స్తుతిస్తారు. మాఘమాసం శిశిరఋతువులో వసంతునికి స్వాగతచిహ్నమూగా ఈ పంచమిని భావిస్తారు. ఋతురాజు వసంతుడైనందున వసంతునికి ప్రేమను కలిగించే మదనుడుడి, అనురాగ వల్లి అయిన రతీదేవిని ఆరాధించడం వల్ల వ్యక్తుల మధ్య ప్రేమాభిమానాలు కలిగి జ్ఞాన ప్రవాహాం జరుగుతుందని పురాణ గ్రంధాలు చెబుతున్నాయి.
వసంతపంచమి సందర్భంగా సంగతి మీడియా మీకు ప్రత్యేక శుభాకాంక్షలు అందజేస్తుంది.
