విద్య విషయంలో కేంద్రం రాష్ట్ర స్థాయిలో ఈ మధ్య చర్చ జరగడం మంచి పరిణామం. మరి ముఖ్యంగా పాఠశాల మౌలిక సదూపాయాల నుంచి ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అనే అంశాలు ముఖ్యాంశాలుగా చర్చకు వస్తున్నాయి. కేంద్రం, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ పెద్దలు ఉపాద్యాయులు అసలు నేర్చుకోవడం మానేశారని పరోక్షంగా చురకలు అంటించడం నుంచి వారికి శిక్షణతోపాటు పరీక్షలు పెట్టాలనే మాటలు చెబుతూనే వారి సేవలు మరువలేనివి అంటూ చెప్పుకొచ్చారు. నిజానికి ఉపాధ్యాయలోకంపట్ల వారికి ఆందోళన ఉన్నదన్నది వాస్తవమే. అయితే, మరి తమ ఆందోళనను పట్టించుకునే నాథుడు ఏడి అనేది ఉపాధ్యాయుల మనోగతం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పరమపవిత్రమైనది ఉపాధ్యాయ వృత్తి. ఎందుకంటే ఆయన వ్యక్తులను తయారు చేస్తాడు. వీరంతా వారి మెదడుకు పుడతారు. ఇది కాదనలేము.
ఉపాధ్యాయులపై చులకన భావం
చాలా విషయాలు ఉపాధ్యాయుల మనసులను తొలుస్తున్నాయి. సామాన్య పౌరుడి నుంచి ఉన్నత స్థాయి వ్యక్తులకు ఉపాద్యాయులంటే చులకన భావం ఏర్పడిందనేది తొలి ఆందోళన. వారి పట్ల కనీసం మర్యాద కూడా ఉండటం లేదని ఇటీవల వెలుగు చూస్తున్న అనేక విషయాలు ఈ విషయాన్ని నిర్దారిస్తున్నాయి. మతపరమైన విషయంలో ఉపాధ్యాయుడిని కాళ్లు మొక్కించడం, చదువు నేర్పడం మావల్ల కాదు ఇంకొందరు కాళ్లుమొక్కడం, ఇంకొందరు పుట్టెడు దుఖంతో గుంజీలు తీయించడం సమాజం పెను ప్రమాదంలో వెళ్లిపోతుందని చెప్పడానికి హెచ్చరికలు. వాస్తవానికి సమాజానికి ఉపాధ్యాయుడికి నేరుగా గొడవ లేదు. విద్యార్థి ప్రధాన మాధ్యమంగా ఆ సంఘర్షణకు దారి పడుతుంది. విద్యాబుద్ధులు నేర్పించేందుకు చేసే ప్రయత్నంలో ఏ మాత్రం ఒక విద్యార్థిని మందలించినా సదరు ఉపాధ్యాయుడు అటు పసి పిల్లాడికి అతడి తల్లిదండ్రులకు శత్రువుగా మారిన పరిస్ధితి. ఈ క్రమంలో ప్రశాంతత అనేది చాలా మంది ఉపాద్యాయులకు కరువై అందోళనకు నిలయంగా వారి మానసిక పరిస్థితి తయారైంది.
తల్లిదండ్రులు, సమాజం దాడులు
దేశ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం గురుస్థానం గొప్పది. అతడితో సమాజం మంచి సంబంధాలు కలిగి ఉండేది. అదే సమయంలో వారు కూడా సమాజంతో చాలా బాద్యతగా ఉండేవారు. ఎప్పుడైతే విద్యార్థుల ముందే తల్లిదండ్రులు ఉపాద్యాయులపై మాటల దాడులు, భౌతిక దాడులు మొదలు పెట్టారో ఈ వృత్తి అంత గొప్పది కాదని, వీరిని ప్రత్యేకంగా గౌరవించాల్సిన అవసరం లేదనే భావన విద్యార్థుల్లో బలంగా నాటుకుపోతోంది. దాంతో కనీసం మర్యాదగా నమస్కారం పెట్టే సంస్కృతిని కోల్పోయాం.
విద్యాబోధన ఒక యజ్ఞం
విద్యాబోధన యజ్ఞం. ఒక ఫ్యాక్టరీలో తయారైన వస్తువు మార్కెట్లోకి అడుగు పెడుతుంది. అది సరిగా పనిచేసినా చేయకపోయినా కొంత ఆర్థికపరమైన హెచ్చుతగ్గులు ఉండొచ్చు లేదా ఆ వస్తువును తిరిగి ధ్వంసం చేసి సరిచేసి మరల ఉపయోగించుకోవచ్చు. మరీ ముఖ్యంగా సదరు వస్తువుకు తిరిగి స్పందించే గుణం ఉండదు. కానీ, వ్యక్తులు అలా కాదు. వీరికి ప్రతి స్పందించే గుణం ఉంటుంది. వస్తువుకు, సంఘటనకు, వ్యక్తులకు, సందర్భాలకు ప్రతి వ్యక్తి ప్రతిస్పందిస్తుంటాడు. ఈ ప్రతి స్పందన రెండుకోణాల్లో ఉంటుంది. ఒకటి సానూకూలం మరొకటి ప్రతికూల భావన. ఈ భావనలను నియంత్రణ చేయగలిగి సక్రమ మార్గంలోకి పంపించగల సత్తా ఒక్క ఉపాధ్యాయుడికే ఉంటుంది.
ఎందుకంటే ఐదేళ్ల ప్రాయంలో ఒక పిల్లాడు విద్యారంగంలోకి అడుగు పెట్టాడంటే వారి చదువును బట్టి గరిష్టంగా 20 ఏళ్లపాటు చదువుల ఫ్యాక్టరీలోనే గడుపుతాడు. అతడిని తరగతిని బట్టి ఉపాధ్యాయుడు అందుకొని ఏ దశలోనూ నిర్లక్ష్యం చేయకుండా పట్టించుకోవాలి. లేదంటే అతడు సక్రమంగా తయారుకాడు. మంచిగా లేడని ఆ వ్యక్తిని ఓ వస్తువు మాదిరిగా ఓ మూలకు పడేయడం సాధ్యం కాదు. కచ్చితంగా అతడు సమాజంలోకి అడుగు పెట్టాల్సిందే. దాదాపు మిగితా జీవితకాలమంతా సమాజంలో మిగితా వ్యక్తులతో గడపాల్సిందే. విద్యార్థిగా తాను ఏ పునాది వేసుకుంటాడో దాని ప్రభావం ఆధారంగానే సదరు వ్యక్తి చిరకాలం స్పందిస్తుంటాడు. కాబట్టి పునాది వేసే ఉపాధ్యాయుడు ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించరాదు.
సత్సంబంధాలుండాలి
ఉపాధ్యాయుడికి స్వేచ్ఛనిచ్చేలా తల్లిందండ్రులు, సమాజం తమను తాము కొంత నియంత్రించుకోవాల్సి ఉంటుంది. ఒక విద్యార్థికి క్రమ శిక్షణలో భాగంగా జుట్టు బాగలేదని, వస్త్రాధరణ బాగలేదని, మంచి భాష ఉపయోగించాలని చెబుతున్నప్పుడు సదరు విద్యార్థి తల్లిదండ్రులు అందుకు అనుగుణంగా స్పందించాలి. దానికి బదులు ప్రతికూలంగానే ఎక్కువగా చూస్తున్న పరిస్ధితి. కానీ, ఒకప్పుడు ఉపాధ్యాయుడు ఏదైన హెచ్చరిక చేస్తే అందుకు తగినట్లుగా తల్లిదండ్రులు సహకరించేవారు. ఓ 20 ఏళ్లు వెనక్కి వెళ్లి చూస్తే మా ఉపాధ్యాయుడు తన బ్యాగ్‌తో దిగితే మేం అప్పుడు ఎదురుగా వెళ్లి ఆయన బ్యాగు మోసేందుకు ఇష్టపడే వాళ్లం. ఆ క్రమంలో ఆయన చక్కగా విద్యార్థులపై చేయి వేసి నడుస్తూ కబుర్లు చెబుతూ వచ్చేవారు. ప్రేమగా పాఠాలు బోధించేవారు.
గ్రామ సర్పంచి అయినా సరే చాలా గౌరవపూర్వకంగా నడుచుకునేవారు. ఆ సమయంలో ఆయన చేత్తో పాఠాలు నేర్చుకున్న మేమంతా దాదాపు వివిధ ఉద్యోగాల్లో స్థిరపడ్డాం. విలువలు కలిగి ఉన్నాం. ఎందుకు ఈ ఉదాహరణ ప్రస్తావించానంటే సత్సంబంధాలు అనేవి ఏ ఇద్దరు వ్యక్తులనైనా కలుపుతాయి. ఇప్పుడవి ఉపాధ్యాయుడికి, విద్యార్ధికి తల్లిదండ్రులకు మధ్య లేవు. ఇవి చాలవన్నట్టు రాజకీయాలు విద్యావ్యవస్థ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాయి. వార్డు మెంబర్ నుంచి ఉన్నత స్థాయి పదవిని అలంకరించిన వ్యక్తులు కూడా ఈ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో అన్నీ ఉంటాయని బల్లచరిచి మరీ వారు విద్యావ్యవస్థను తమ ప్రచార కేంద్రాలుగా మార్చుకుంటున్నారు. ఈ సందర్భంగా ఓ విషయం స్పష్టంగా తెలిసేది ఏమిటంటే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చక్కని భావి భారతాన్ని ప్రసవించేవారు ఉపాధ్యాయులే. నిండు చూలాలిని నిర్లక్ష్యం చేస్తే ఎంత ప్రమాదమో ఉపాధ్యాయుడిని నిర్లక్ష్యం చేసినా అంతే ప్రమాదం.
(విహారీ) ఎం.నాగేశ్వరరావు, 9248308886
