సంగతి న్యూస్, న్యూఢిల్లీ: ఇండిగో విమాన సర్వీసుల రద్దు.. ఆలస్యంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. మూడు రోజుల్లోగా ఈ సమస్యను తీర్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సంఘటనలకు బాధ్యులెవరు.. ఎలా జరిగిందనే విషయాన్ని నిగ్గు తేల్చేందుకు ఉన్నత స్థాయి కమిటీని వేసింది. ఈ మేరకు పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఒక ప్రకటన చేశారు. తప్పు ఎక్కడ జరిగిందో.. ఎవరు చేశారో తేల్చిన తర్వాత దర్యాప్తు ఆధారంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు.
ప్రయాణికుల అవస్థలు
ఇండిగో విమాన సర్వీసలు ఎంచుకున్న ప్రయాణికులు ఎయిర్ పోర్టుల్లో చిక్కుకుపోయి నరకయాతన అనుభవిస్తున్నారు. తమ వెంట తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. అనూహ్యంగా ఇతర విమాన సర్వీసుల టికెట్ రేట్లు కూడా అమాంతం పెరిగిపోవడంతో ఆ భారం మోయలేక తమ ఇళ్లకు వెళ్లలేక అక్కడే ఉండిపోతున్నారు. ఈ సమస్య ఓ కొలిక్కి రావాలంటే ఐదు నుంచి 10 రోజులు పట్టే అవకాశం ఉంది. నిన్న వెయ్యి విమాన సర్వీసులు రద్దు కాగా నేడు కూడా అలాగే కొనసాగేలా ఉంది పరిస్థితి.
