ఇంటర్నెట్ డెస్క్: రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ఆపేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా అది సాధ్యం కాకపోవడంతో రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై (Traiffs On Russias trading partners) అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పెద్దమొత్తంలో సుంకాలు విధిస్తున్న విషయం తెలిసిందే. సుంకాల పెంపునకు సంబంధించిన బిల్లుకు తాను మద్దతిస్తున్నట్లు తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. మాస్కోతో వాణిజ్యం చేసే దేశాలపై మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు పేర్కొన్నారు. ఇందులోభాగంగా రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై 500 శాతం టారిఫ్‌లు (Trump Traiffs) విధిస్తానన్నారు.
ఈ దేశాల జాబితాలో భారత్, చైనా ఉన్నట్లు తెలుస్తోంది. ఇరాన్‌ను కూడా ఇందులో చేర్చనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ.. ఉక్రెయిన్‌కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తున్నామన్నారు. భారత్, చైనాలే ఆ దేశం నుంచి 70శాతం చమురును కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా నుంచి పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. మన ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై ప్రభావం పడుతుంది. ఈ బిల్లును రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఇటీవల ప్రతిపాదించారు.
ఇది చదవండి:మెక్సికోలో హింసాత్మకంగా మారిన జెన్-జడ్ నిరసనలు
రష్యాకు సహకరిస్తున్న దేశాలపై కఠిన చర్యలు తీసుకోవడం తప్ప ప్రస్తుతం తమ దేశానికి వేరే మార్గం లేదని ట్రంప్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ముగించేలా రష్యా కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తే మాస్కోతో వ్యాపారం చేస్తున్న దేశాలపై టారిఫ్‌ల తగ్గింపునకు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు.
