టీ20 వరల్డ్ కప్ 2026 భవితవ్యం ప్రశ్నార్థకం – భారత్ మ్యాచ్కు పాక్ నిరాకరణతో సంక్షోభం
2026 టీ20 వరల్డ్ కప్ భవితవ్యం ప్రస్తుతం అనిశ్చితిలో పడింది. ఫిబ్రవరి 15న భారత్తో జరగాల్సిన మ్యాచ్లో పాల్గొనవద్దని పాకిస్తాన్ ప్రభుత్వము తమ జట్టుకు ఆదేశాలు జారీ చేయడంతో ఈ సంక్షోభం మొదలైంది. ఈ ప్రకటన అనంతరం వెనుకదారి చర్చలు (బ్యాక్-చానల్ టాక్స్) ప్రారంభమైనప్పటికీ, ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధికారిక చర్చలకు దిగాయి.
అయితే, మాజీ ఐసీసీ చైర్మన్ ఎహ్సాన్ మాని అభిమానులకు పెద్దగా ఆశలు పెట్టుకోవద్దని హెచ్చరించారు. పరిస్థితి ఇప్పటికే చాలా దూరం వెళ్లిపోయిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమస్యకు ఒక్క పక్షాన్నే బాధ్యుడిగా చూపడానికి ఆయన నిరాకరించినప్పటికీ, దీనికి ప్రధాన కారణం రాజకీయ జోక్యమేనని స్పష్టం చేశారు. భారత్తో మ్యాచ్ను బహిష్కరించాలన్న పాకిస్తాన్ నిర్ణయం “నిరాశ నుంచి పుట్టిన ప్రతిచర్య” అని మాని వ్యాఖ్యానించారు.
‘మాట్లాడితే పరిష్కారం దొరికేది’ – ఎహ్సాన్ మాని
రెవ్స్పోర్ట్జ్తో మాట్లాడుతూ, మాజీ ఐసీసీ చైర్మన్గా తన అనుభవాన్ని మాని గుర్తుచేశారు. ఇలాంటి సంక్షోభాలు తలెత్తకుండా ఉండాలంటే తొలిదశలోనే సంభాషణ చాలా కీలకమని ఆయన అన్నారు.
“నేను ఐసీసీ చైర్మన్గా ఉన్నప్పుడు ఇలాంటి పరిస్థితి ఎదురైతే పరిష్కారం కనుగొనడానికి ప్రయత్నించేవాడిని. ఎలాంటి సభ్యదేశాన్నీ టోర్నమెంట్ నుంచి బయటకు నెట్టేయడం మంచిది కాదు. పీసీబీ ఓ వైఖరిని తీసుకుంది. కానీ వారు అలా చేయకుండా ముందుగా చర్చలు జరిపి ఉండాల్సింది. బెదిరింపులు, తీవ్ర నిర్ణయాల కంటే సంభాషణే అవసరం. అయితే ఈ ప్రయత్నం రెండు వైపుల నుంచీ రావాలి,” అని మాని అన్నారు.
ఐసీసీ నిర్ణయంపై పాకిస్తాన్ అసంతృప్తి
జయ్ షా, ఐసీసీ బోర్డు తీసుకున్న నిర్ణయం ఏకగ్రీవమని, అందులో పాకిస్తాన్ మాత్రమే విభేదించిందని మాని గుర్తు చేశారు.
“సాధారణంగా బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని అంగీకరించాలి. కానీ పీసీబీకి అది అన్యాయంగా లేదా రాజకీయ ప్రేరితంగా అనిపించింది. ఈ విషయం మొదట్లోనే చర్చల ద్వారా పరిష్కరించాల్సింది. జయ్ షా, మిస్టర్ నఖ్వీ నేరుగా మాట్లాడాల్సింది. పీసీబీ వైఖరి తాము పక్కనపెట్టబడ్డామన్న భావనకు ప్రతిస్పందనగా వచ్చింది,” అని మాని అభిప్రాయపడ్డారు.
పైనుండే చర్చలు జరిగితేనే పరిష్కారం
పరిస్థితి నుంచి బయటపడేందుకు అత్యున్నత స్థాయిలో – చైర్మన్ టు చైర్మన్ – చర్చలు జరిగితేనే మార్గం దొరుకుతుందని మాని స్పష్టం చేశారు.
“నిజంగా చెప్పాలంటే, అగ్రస్థాయి చర్చలు జరిగితే తప్ప పెద్దగా ఆశలు పెట్టుకోను. సమస్య పరిష్కారానికి జయ్ షా స్వయంగా పాకిస్తాన్కు వెళ్లి చర్చలు జరిపి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. నా పదవీకాలంలో నేను అప్పటి భారత క్రీడల మంత్రి సునీల్ దత్ వంటి వారితో వ్యక్తిగతంగా సమావేశమయ్యాను,” అని ఆయన చెప్పారు.
మంచి మనసు ఉంటేనే మార్గం
సందేశాలు మోసుకెళ్లే దూతల వల్ల ప్రయోజనం ఉండదని, నేరుగా చైర్మన్లే కలవాలని మాని తేల్చిచెప్పారు.
“రెండు వైపులా సత్సంకల్పం ఉంటే పరిష్కారం సాధ్యం. మధ్యవర్తులను పంపితే సందేశాలు మాత్రమే తిరుగుతాయి. చైర్మన్లు నేరుగా ముఖాముఖీగా మాట్లాడితేనే ఈ ప్రతిష్టంభన తొలగుతుంది,” అని ఆయన అన్నారు.
